నా భర్తకు కోపమెక్కువ...
నా వయసు 30 సంవత్సరాలు. వివాహమై నాలుగేళ్లయ్యింది. రెండు నెలల పాప ఉంది. నేనూ నా భర్త ఇద్దరం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లమే. సమస్య అంతా నా భర్తతోనే. మొదటి నుంచీ అతని మాటలు, చేతలు తీవ్రంగానే ఉండేవి. కోపం వస్తే చేతిలో ఉన్నది విసిరేస్తాడు. నోటికీ అదుపు ఉండదు. పిల్లలు పుడితే మారతాడని ఓపికగా ఎదురుచూశాను. ఈ మధ్యలో ఆఫీసు పని మీద నేను 20 రోజులు విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. అది నా భర్తకు నచ్చలేదు. అతనికి అటువంటి అవకాశం రాలేదు. నేను వెళితే నలుగురిలో తనకు చులకనగా ఉంటుందని, నా తల్లిదండ్రులు తనను గౌరవించరని గొడవ. నిజానికి వారు చాలా బాగా ఉంటారు. ఎలాగో వెళ్లి వచ్చాను. అప్పటి నుంచీ నేను తనని మోసం చేశానని, నాతో కాపురం చేయనని అంటున్నాడు. ఏదో కోపంలో అన్నాడనుకున్నా. కానీ పాపను చూడడానికి కూడా రావడం లేదు. అడిగితే కోపం తగ్గలేదంటున్నాడు. అతను చెప్పినట్లు నడుచుకుంటే తీసుకెళ్తాడట. కానీ వెళ్లాక ఏదో ఒక గొడవ పెడతాడని భయంగా ఉంది. ఏం చేయమంటారు?
ప్రియ
మీ భర్త స్వభావం మొదటి నుంచీ అంతే అంటున్నారు. మరి అలాంటప్పుడు విదేశాలకు వెళ్లే ముందు, పిల్లల్ని కనే ముందు కాస్త ఆలోచించాల్సింది. ఇటువంటి భర్తతో నాలుగేళ్లుగా ఉన్నారంటే అర్థం చేసుకునే ఉంటారు కదా! అతనిది తీవ్రమైన స్వభావం. కానీ ముందే మీరు ఆఫీస్ ట్రిప్ ఎంత ముఖ్యమో నచ్చజెప్పాల్సింది. ఇటువంటి స్వభావం ఉన్న వ్యక్తులు త్వరగా ఆత్మన్యూనతకు గురవుతారు. తాము చెప్పేదే కరెక్ట్ అని నమ్ముతారు. ఆఫీసులో వారి ఆటలు సాగవు కాబట్టి ఇంట్లో ఆధిపత్యం చలాయించి సంతృప్తి పడతారు. అతనికి రాని అవకాశం మీకు రావడం పెద్ద దెబ్బ. దానికి ప్రతీకారం ఇలా తీర్చుకుంటున్నాడు. అయితే అతనిలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉండే ఉంటాయి. లేకపోతే మీరు ఇన్ని రోజులు కలసి ఉండలేరు. వీలైతే మీరు అతన్ని కలసి సావకాశంగా మాట్లాడండి. అతని ఆరోపణలు తప్పు అని వివరించండి. అతని మంచితనం వివరిస్తూనే, కోపం వల్ల మీ కుటుంబ జీవితానికి జరుగుతున్న నష్టం గురించి చెప్పండి. ఇదంతా సాధ్యం కాదనుకుంటే అప్పుడు విడిగా జీవించడం గురించి ఆలోచించాలి. కానీ తల్లిదండ్రులయ్యారు కాబట్టి సామరస్యంగా కలిసిపోవడానికే ముందడుగేయండి.