ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒకే భర్త... వ్రతం ఎలా ఆచరించారంటే...
ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలోని మహిళలు భర్త దీర్ఘాయువును కోరుతూ కర్వాచౌత్ వ్రతాన్ని ఆచరించారు. అయితే మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లు అత్యంత విచిత్రమైన రీతిలో ఈ వ్రతాన్ని చేపట్టారు. ఒకే వ్యక్తి ఎదుట ఈ ముగ్గురూ వ్రతం నిర్వహించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. వరుసకు అక్కాచెల్లెళ్లయిన ఈ ముగ్గురూ వ్రతంలో భాగంగా చేతిలో జల్లెడను పట్టుకుని తమ ఏకైక భర్త ముఖాన్ని దానిలో నుంచి చూశారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లోని చిత్రకూట్ పరిధిలోని లోఢ్వారాకు చెందిన కాశీరామ్ కాలనీనివాసి కృష్ణకు 12 ఏళ్ల క్రితం అక్కాచెల్లెళ్లయిన శోభ, రీనా, పింకీలతో ఒకేసారి వివాహమయ్యింది. అప్పటి నుంచి వారంతా కలిసి ఉంటున్నారు. వారిలో ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున పిల్లలు ఉన్నారు. మిగిలిన మహిళల మాదిరిగానే వీరు కూడా కర్వాచౌత్ వ్రతాన్ని చేపట్టారు. ఉదయమంతా ఉపవాసం ఉండి, సాయంత్రం దాటాక చంద్రుని సమక్షంలో జల్లెడలో భర్త ముఖాన్ని చూశారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈ వ్రతాన్ని ఆచరించారు.